తొక్కిసలాట ఘటనతో హీరో అల్లు అర్జున్, అతని ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తొక్కిసలాటలో రేవతి(32) అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు సాయి తేజ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. రేవతి భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు సాయి తేజ, సాంగ్వికతో కలిసి సంధ్య థియేటర్‌కి వెళ్లింది. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగానే తొక్కిసలాట జరిగి రేవతి, సాయి తేజ జనంలో చిక్కుకున్నారు. ఊపిరాడక రేవతి మృతి చెందారు. సాయి తేజను పోలీసులు జనాల నుంచి బయటకు తీసుకొచ్చి సీపీఆర్ చేశారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు BNS సెక్షన్ 105, 118 (1) కింద కేసు నమోదు చేశారు.