డోలీల్లో ప్రాణాలు
ఏజెన్సీలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,915 గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో 1,724 గ్రామాలకు మాత్రమే తారురోడ్డు సదుపాయం ఉంది. మిలిగిన 2,191 గ్రామాలకు ఎలాంటి రోడ్డు సదుపాయం లేదు. ఈ ఏజెన్సీల్లోని గిరిజనులు కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుంటూ ఓ మహాయుద్ధమే చేసి బాహ్య ప్రపంచాన్ని చేరుకుంటారు. అనారోగ్య సమస్యలు, గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు వీరి అవస్థలు వర్ణనాతీతం. రోగులను, గర్భిణీలను డోలీల్లో కొండ కొనల్లోంచి, ప్రమాదకరమైన దారుల్లో పదుల అధికారులు మోసుకుని వచ్చి రోడ్డున్న ప్రాంతాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి అంబులెన్సుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుస్తారు. ఈ డోలీ ప్రయాణాల్లో చివరి వరకు చేరి ప్రాణాలు నిలబెట్టుకునే వారి శాతం తక్కువ. ఏజెన్సీలో నిత్యం ఏదో డోలీలు కనిపిస్తూనే ఉంటాయి. ఎన్నికల సమయాల్లో వచ్చి రోడ్డు వేస్తామని హామీలిచ్చి ఓట్లు వేయించుకునే నేతలు..ఎన్నికల తర్వాత మళ్లీ కనిపించరని గిరిపుత్రులు వాపోతుంటారు.