ఆంధ్ర రాష్ట్ర కొత్త రాజధాని అమరావతికి రైల్వేలైన్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు ఈ కొత్త రైల్వే లైన్ కు 2,245 కోట్లు వెచ్చించనున్నారు. కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల రైల్వే వంతెన నిర్మాణంతోపాటు మొత్తం 57 కిలోమీటర్ల మేర ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది.హైదరాబాద్, చెన్నై, కలకత్తా సహా దేశంలోనే ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.మరో ఐదేళ్లలో రైల్వే లైన్ పూర్తి చేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలియజేశారు.
అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు,, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కొత్త రైల్వే లైన్ ఏర్పడడం వల్ల అమరావతి దేశంలోనే ఇతర ప్రాంతాలతో అనుసంధానం కానుంది అన్నారు.
పరిటాల ప్రాంతాన్ని మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ వస్తుందని తెలిపారు. ఏపీలో మొత్తం 73 రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అమరావతి- హైదరాబాద్, అమరావతి-చెన్నై కారిడార్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అమరావతి-బెంగళూరు కారిడార్ అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. రైల్వే లైన్ ద్వారా అమరావతికి ప్రత్యక్ష అనుసంధానం ఉంటుంది. ప్రజా రవాణాకు, పరిశ్రమల స్థాపనకు మెరుగైన వ్యవస్థలా ఉంటుంది.