ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ ఈరోజు విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. ఆ గ్రామంలో కలుషిత నీరు తాగి అతిసారం వల్ల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. అంతకుముందు గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
గుర్ల గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదిక వద్ద బాధిత కుటుంబాలను వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అతిసార ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు..
చనిపోయిన కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలుంటే వారి విద్యా బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అతి సారంవల్ల ఏడుగురు చనిపోవడం చాలా బాధ కలిగించిందని విచారణ వ్యక్తం చేశారు. అలాగే కొద్ది మంది ఆసుపత్రి పాలవడం ఆవేదన కలిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఆ గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా, నీటి కాలుష్యం నివారించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు.బాధిత కుటుంబాలు చెప్పిన విషయాలను చాలా ఓపిగ్గా విన్న డిప్యూటీ సీఎం పవన్ సమస్యలు తీర్చేలా పని చేస్తామని భరోసా ఇచ్చారు. శుద్ధిచేసిన తాగునీరు ప్రతి కుటుంబానికి అందేలా జల జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు.
అంతకుముందు నెల్లిమర్ల ఆర్ఎస్ రైల్వే స్టేషన్ సమీపంలోని సమీపంలోని చంపానదిపై ఉన్న రక్షిత మంచినీటి పథకం పంపింగ్ హౌస్ ను పరిశీలించారు. అతిసారం ప్రబలిన గుర్ల గ్రామం తో పాటు పరిసర ప్రాంతాలకు ఈ పంపింగ్ హౌస్ నుంచే నీటి సరఫరా అవుతుందని అధికారులు పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు.నీటిశుద్ధి ప్రక్రియ, రక్షిత మంచినీరు సమీప గ్రామాలకు ఎలా అందుతుందన్న తీరును అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. నీరు కలుషితం ఎక్కడ అవుతుందో అన్న దానిపైన పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.
నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచినీరు సమీప గ్రామాలకు ఎలా అందుతుందన్న తీరును అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. నీరు కలుషితం ఎక్కడ అవుతుందో అన్నదాని పైన పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.నీటి శుద్ధి విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులకు, జల వనరుల శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వాడే పాతకాలం నాటి ఫిల్టర్ బెడ్లు తక్షణమే మార్చాలని ఆదేశించారు. మంచినీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటికీ అవసరమైన మరమ్మత్తులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
తాగునీటి సరఫరా విషయంలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. నిధుల కొరత లేదని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని, గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నీటి కాలుష్యానికి గల కారణాలు తెలుసుకోవాలని, దాని నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు చెప్పారు. తాగునీటి కాలుష్యానికి గల కారణాలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఆదేశించారు.