తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పనులు ఎట్టకేకలకు పునఃప్రారంభం అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత రాజధాని కట్టడం పనులు పునఃప్రారంభించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి సి.ఆర్.డి.ఏ కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతల మీదుగా ఇటుక పేర్చి పనులు మొదలుపెట్టారు. ఈ భవనాన్ని G+7 విధానంలో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ కార్యక్రమంతో రాజధాని పనులు పునఃప్రారంభమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కొత్త రాష్ట్ర రాజధాని అభివృద్ధికి నాంది పలికింది. ఇందుకుగాను రాష్ట్ర నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ధ్రువీకరించింది. అందుకుగాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను రాజధానికి కేటాయించింది. కానీ ఆ భూమి సరిపోకపోవడంతో రైతుల నుండి సేకరించాలని ఆదేశించింది. అలాగే చుట్టుప్రక్కల ఉన్నటువంటి రైతుల నుండి 34,241 ఎకరాలు రాజధాని కోసం సేకరించింది. ఈ భూ సేకరణ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద భూసేకరణగా రికార్డు ఎక్కింది.
ఒక పట్టణ నిర్మాణానికి ఇంత పెద్దగా భూ సేకరించటం ఇదే మొదటిసారి.దాదాపుగా 29,000 రైతులు ఈ భూములను ఆంధ్ర రాష్ట్ర కొత్త రాజధాని అమరావతి కోసం ఇచ్చారు. 2014-2019 లో తెలుగుదేశం పార్టీ రాజధాని పనులు మొదలుపెట్టి కొన్ని కొన్ని భవనాలు, రహదారులు, వంతెనలు నిర్మించారు. రాజధాని ప్రాంతాన్ని గుర్తించటం, భూమి సమీకరణ, ప్రణాళిక తయారు చేయటం, లోటు బడ్జెట్ తో రాజధాని నిర్మాణం అనుకున్నంత జరగలేదు. కానీ తర్వాత 2019-2024 అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదంతో అమరావతిని పట్టించుకోలేదు. ఈ ఐదు సంవత్సరాల లో కట్టిన భవనాలు శిథిలావస్థ స్థితికి చేరుకున్నాయి.
ప్రపంచ టాప్ 10 నగరాల్లో అమరావతి
అమరావతిని ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన నగరంగా అభివృద్ధి చేస్తామని, గొప్ప గ్రీన్ సిటీగా అమరావతి ఉండబోతుందని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. పర్యాటకులు వచ్చేలాగా, ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు, మిగతా ఉద్యోగుల కోసం చేపట్టిన అపార్ట్మెంట్ భవనాలు, హైకోర్టు జడ్జి భవనాలు, మంత్రులు, గెజిటెడ్ ఆఫీసర్ల కోసం నిర్మించిన భవంతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.
అమరావతిని సమీప నగరాల అయినటువంటి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. కాలుష్య రహిత నగరంగా ఉండాలంటే గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని, EV స్టేషన్లు, వాకింగ్ రోడ్స్, సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతిని విశాలమైన రహదారులతో, నీటి సరఫరా, విద్యుత్తు, ఇంటర్నెట్ కేబుల్ అన్నింటిని భూగర్భంలోనే వెళ్లేలా ఒక గొప్ప నగరంగా నిర్మిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతిని అభివృద్ధి చేసేలా సంబంధిత మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన సమయంలోగా ఎట్టి పరిస్థితిలోనూ అమరావతి నగర నిర్మాణం పూర్తికావాలని గట్టిగా తీర్మానించుకున్నారు.
‘అమరావతి’ అనే పేరు పెట్టింది ఆయనే
రాజధానికి నామకరణ చేసింది రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీ రావే అని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒకరోజు రామోజీరావు తనకు ఫోన్ చేసి ఆ ప్రాంత చారిత్రక నేపథ్యంపై పరిశోధన చేశానని, అమరావతి అనే పేరు సరిపోతుందని చంద్రబాబుకు సూచించారు. అమరావతి అనే పేరు కూడా చంద్రబాబుకు చాలా బాగా నచ్చిందని, ఆ పేరు తన పక్కన ఉన్న వారికి చెపితే అందరూ బాగుందని చెప్పారు.ఆ పేరుని ప్రజల ముందు పెడితే నూటికి నూరుశాతం ఆమోదం లభించిందని చంద్రబాబు తెలియజేశారు. ఇది దేవతల రాజధాని అని చాలా గొప్పగా అభివర్ణించారు.